Sunday, May 8, 2016

Process of making Palmyra Jaggery - A case study.నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తారా? నిజం
మనిషి సాదించలేనిది ఏది లేదు, పట్టుదల ఉంటే  మనిషి ఏమైనా  చేయవచ్చు అని ఆయన అంటుంటే అదేదో కొత్త మాట విన్నట్లు అనిపించింది. ఇదివరకు అనేక సార్లు ఈ మాట విన్నప్పటికి ఇపుడేమో ఏదో తెలియని మార్పు స్పురించింది. ఆయన చెప్పేది చేసేది ఒకటే అయినందుకేమో? అప్పటికే ఆయన 20 తాటిచెట్లు ఎక్కి నిరా సేకరించారు[తాటిచెట్టు గెల కు కోట పెట్టగా కారే తియ్యటి ద్రవాన్ని నీరా అంటారు, దీనికి సూర్యరశ్మి తగిలినా, గాలి తగిలినా పులిసి కళ్ళు గా మారుతుంది, అలాకాకుండా కుండ అడుగు భాగంలో సున్నం {నత్తలతో తయారుచేసేది} వ్రాయడం వలన రాత్రి నుండి ఉదయం 12.00 గంటలవరకు కుండలోని ద్రవం పులియదు దీనినే నీరా అంటారు]. ఇలా సేకరించిన నీరా ను మరగబెట్టి పాకం వచ్చాక చల్లార్చి అచ్చులలో వేసి తాటి బెల్లం తయారుచేస్తారు. తాటిబెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది, అనేక ఆయుర్వేద మందులలో తాటి బెల్లం వాడతారు.  చింతూరు నుండి 30.5.2016 ఉదయం 6.00 గంటలకు బయలుదేరి కొంతమంది గిరిజన రైతులతో [కల్లు తీసేవారు] బయలుదేరి రాజమహేంద్రవరం లో డాక్టర్ పి.సి. వెంగయ్య గారిని వెంట బెట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు సమీపంలోని ఉనాగట్ల ప్రాంతానికి 10.45 గంటలకు తాటి బెల్లం తయారుచేసే విధానం తెలుసుకొందామని చేరుకున్నాము. ముందుగా బెల్లం తయారుచేస్తున్న పొయ్యి వద్ద ఉన్న వెంకట లక్ష్మి గారిని చూశాము, ఆమె ఎవరితోనో చాలాసేపటివరకు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు మాతో తీసుకువెళ్లిన ఆడవారిని అక్కడ వదిలేసి, అసలు బెల్లం ఉత్పత్తి దారు యజమాని, కార్మికుడు అయిన శ్రీను గారిని కలిసేందుకు కొంత దూరంలో ఉన్న తాటి చేట్టు వద్దకు మాజట్టు చేరుకుంది. చెట్టు పై నుండే ఆయన డాక్టర్ వెంగయ్య గారిని నమస్కారం  పెట్టి పలకరించారు. వెంగయ్య గారి ఉధ్యనవన పరిశోధన కేంద్రం తరపున వీరిద్దరికి చాలా కాలం  నుండి పనిపరంగా  పరిచయం ఉంది. ఆయన నిరా తీసుకొని తాటిచెట్టునుండి దిగిన వెంటనే మావాళ్లు వివరాలు అడగడం మొదలుబెట్టారు. మెచ్చుకోలుగా నేను ఆయన భుజం మీద చేయి వేసినపుడు అయ్యో మీ చేతులకు మురికి అంటుద్ది బాబయ్య అని, చేయి కలిపినపుడు చెయ్యి  మురికిగా ఉందని, రెండు చేతులెత్తి నమస్కరించినపుడు కంగారుపడి అలా చేయవద్దని దగ్గరగా పరిగెత్తుకొచ్చి నన్ను ఆపేశారు ఆయన చేతులను ముద్దాడాలనిపించింది  అవకాశం దొరకలేదు. స్వశక్తి ని నమ్ముకుని కష్టించి పనిచేసి పది మందికి ఆదర్శంగా నిలిచే ఇలాంటివాళ్లు ఇంకా సమాజం లో ఉన్నందుకు చాలా సంతోషం అనిపించింది. వెంగయ్య గారు ఆయనగురించి  చెబుతూ ఎక్కువ కష్టం చేస్తారని అంటే, ఉర్కొండి సార్ నేనేం కష్టం చేస్తాన్నాను అని ఆమాత్రం [క్రెడిట్] గౌరవం కూడా తను అంగీకరించలేదు. మేము అడగకుండానే మేము గౌడ లండి అన్నారాయన. ఎంత సంపాదిస్తారని నేను అన్నపుడు ఏదో కడుపుకు సరిపోను అని ముక్తాయించారు. వెంగయ్య గారు మా గురించి పరిచయం చేశారు చింతూరు నుండి నేర్చుకోడానికి వచ్చారని, ఆయన సంతోషం గా ఇలా చెబితే అర్ధం కాదండీ వాళ్ళు నేను ఒకేసారి చెట్టు ఎక్కి అక్కడ వివరిస్తే మంచిగా అర్ధం అవుతుందని అన్నారు.   వీరి పేరు వీరవల్లి శ్రీను గారు ఆయన సేకరించిన నిరాను ఎప్పటికప్పుడు తాజాగా చిన్న కావడి తో  బెల్లం వండే పాక వద్దకు చేర్చేందుకు ఒక తాతను వారు కూలి పద్దతిలో  ఏర్పాటు చేసుకున్నారు.  వీరికి ఒక బాబు 10వ తరగతి పరీక్షలు మొన్ననే వ్రాసారు.  శ్రీను గారు ప్రతి యేట సుమారు 30 తాటి చెట్లను కౌలు కు తీసుకుంటారు ఆయనకు సొంత చెట్లు లేవు. ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీరా తీయడం బెల్లం తయారుచేయడం వీరి పని. శ్రీను గారు నీరా తీయడం తాతయ్య తెచ్చి బెల్లం పాక కు చేర్చుతారు. శ్రీను గారి శ్రీమతి వెంకటలక్ష్మి గారు ఉదయం 7.00 గంటలకు పొయ్యి మొదలు పెట్టి సుమారు 1.00 గంటకు ఒక వంటకం పూర్తిచేస్తారు.సుమారు 15 కేజీల బెల్లం వస్తుంది, మరలా మొదలు బెట్టి సాయంత్రం 5.00 గంటలకు రెండవ వంట పూర్తి అవుతుంది. ఆ తరువాత మరలా తాతయ్య ను తీసుకొని చుట్టుపక్కల గల కొబ్బరి చెట్ల మట్టలు [మంట కొరకు ఉపయోగించేందుకు] సేకరిస్తారు. అలా రాత్రి 8.00 గంటలకు గాని వీరి పని పూర్తి కాదు. ఇక శ్రీను గారు ఉదయం 6.00 గంటల నుండి  మధ్యాహ్నం 1.00 గంట  వరకు తాటిచెట్లు ఎక్కి నిరా సేకరిస్తారు. భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకొని మరలా 3.30 నుండి రాత్రి 8.30-9.00 గంటలవరకు అన్నీ తాటిచెట్లు ఎక్కి గీత బెడతారు. విరైతే చెప్పలేదు కానీ వీరి సంపాదన 4 నెలల్లో రూ. 4.00 లక్షలు వరకు ఉంటుంది. మే నెల తరువాత తాటి పండ్లు ఏరి తెగల కొరకు వాటిని భూమిలో ప్రత్యకంగా చేసిన గోతిలో పాతుతారు. దీని వల్ల  ఈయన జనవరి, ఫిబ్రవరి లో 1.00 లక్ష తాటితేగలు అమ్ముతారని తోట యజమాని చెప్పారు.
 తాటిబెల్లం వండెప్పుడు పంచదార కలిపి బెల్లం విలువ పోగొడుతున్నారు వెదవలు, వారిని ఆపండి బాబయ్య అంది వెంకటలక్ష్మి. అంతేకాదు సొసైటీ వాళ్ళు డబ్బులు సరిగా ఇవ్వడం లేదని నీరాలో నీళ్ళు కలుపుతున్నారని దాంతో బెల్లం కాకుండా పాకం వస్తుందని వాపోయింది. తాము మాత్రం పానం పోయిన కల్తీ చేయమని సత్యప్రమానకంగా చెప్పింది. బెల్లం పాకం చూస్తున్నపుడు అలా చేయాలి అని వెంగయ్య గారు అంటుటే అంతే కాదండీ దీంట్లో చమత్కారం ఉందని చమత్కరించింది. ఆ చమత్కారాన్ని మావాళ్ళకు చింతూరు వచ్చి నేర్పాలని నేనంటే అలాగే బాబయ్య జనవరి నెలలో అయితే వస్తామని మాట ఇచ్చింది. ఫోన్ లో అంతసేపు ఎవరితో మాట్లాడవని అడిగితే బయటి దేశంలో ఉన్న తన  అన్నయతో మాట్లాడినట్లు చెప్పి వాడు ఏదో కష్టాల్లో ఉన్నాడు, ధైర్నమ్ చెప్పానని చెపుతూనే కళ్ళెంట నీళ్ళు తీసుకుంది. మేము చాలా ఏతన పడుతున్నాం బాబయ్య మా అబ్బాయికి ఏదైనా ఉధ్యోగమ్ చూపించండని కోరింది......జై శ్రీను, జై, జై శ్రీను. 

No comments:

Post a Comment